మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్‌కు సంబంధించిన ఏదైనా వార్త బయటకు వచ్చినా, ఆయన సినిమా విడుదలైనా పూనమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం చర్చనీయాంశంగా మారుతోంది. గతంలోనూ ఆయనపై పరోక్షంగా ఆరోపణలు చేసిన ఆమె.. ఈసారి మరింత ఘాటైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ఫేక్ గురూజీ’ అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తన సినీ కెరీర్‌ను ముగించారని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నువ్వు నా కెరీర్‌ను ముగించావు. నీ దుర్వినియోగాన్ని నేను ప్రశ్నించాననే కారణంతో ఇలా చేశావా? ఇప్పుడు దేవుడు నీకు ఏమి చేశాడో చూడు. కనీసం కొంతైనా సిగ్గుపడాలి. వేదికలపై నువ్వు నీతులు చెప్పవచ్చు.. కానీ నేను వాటిని ఆచరిస్తాను” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.

అయితే ఈ పోస్టులో త్రివిక్రమ్ పేరును పూనమ్ నేరుగా ప్రస్తావించలేదు. ‘ఫేక్ గురూజీ’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించేనని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. గతంలోనూ త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్పందించాలంటూ పూనమ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. పూనమ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ప్రతిభ ఉంటే ఎవరూ ఆపలేరని, ఒకరిపై పదేపదే ఆరోపణలు చేసినంత మాత్రాన వారి కెరీర్‌కు నష్టం జరగదని వ్యాఖ్యానించారు.

‘ఆదర్శ కుటుంబం’ సినిమా పూనమ్‌కు నచ్చకపోవచ్చు కానీ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారని, ఆదివారం కూడా థియేట‌ర్స్ ప్రేక్షకులతో నిండిపోయాయని పేర్కొన్నారు. ‘అజ్ఞాతవాసి’ నుంచి ‘అరవింద సమేత’ వరకు త్రివిక్రమ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, పడటం.. మళ్లీ లేవడం ఆయనకు కొత్తేమీ కాదని కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి పూనమ్ కౌర్ తాజా పోస్టుతో త్రివిక్రమ్‌తో ఆమెకు ఉన్న వివాదం మరోసారి చర్చకు వచ్చింది. ఆమె చేసిన ఆరోపణలపై త్రివిక్రమ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *