ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని బనస్కాంత జిల్లా భీల్డి వేదికగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 24వ విడత నిధులను అధికారికంగా విడుదల చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ సొమ్ము జమ అయింది. దేశవ్యాప్తంగా మొత్తం 9.34 కోట్ల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ విడత కింద మొత్తం రూ. 18,680 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతీ అర్హత కలిగిన రైతు ఖాతాలో ఉచితంగా రూ. 2,000 చొప్పున సాయం ట్రాన్స్ ఫర్ చేశారు.
ఈ విడతలో భాగంగా ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే 52.33 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రూ.1,051 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందింది. ఈ పథకం ద్వారా ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ. 6,000 చొప్పున మూడు విడతల్లో (విడతకు రూ. 2,000) ఆర్థిక సాయం అందజేస్తారు. ఇప్పటివరకు దాఖలైన 24 విడతల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు రూ. 4.65 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా చేరాయి.
